శ్రీ:
శ్రీమతే శ్రీలక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః
లోటులేని పరిపూర్ణ జీవితానికి వేదం ఉపదేశించే మార్గం
( 1 ) ఉమ్
(శ్రీ ఉ.వే. ముక్కూర్ లక్ష్మీనరసింహాచార్యార్ గారి ఉపన్యాసాల నుండి సేకరించబడిన వేద మణితునకలు)
(సేకరణ: శ్రీ ఉ.వే. ముక్కూర్ శ్రీనివాసన్)

1. పలకగల వారికి, స్మరించగల వారికి తమ ఊరే వైకుంఠం అవుతుంది!
2. విష్ణు అని చెబితే అది తిరునామం. “ఓం విష్ణవే నమః” అంటే అదే మంత్రం అవుతుంది. ఆరు అక్షరాలతో కూడిన ఉన్నతమైన మంత్రం ఇది. ఒక పుష్పాన్ని లేదా తులసి దళాన్ని తీసుకుని “ఓం విష్ణవే నమః” అని అర్చన చేస్తే ఆ ఎంపెరుమానుడు పరమానందాన్ని పొందుతాడు.
3. తులసిని జాగ్రత్తగా గోరు తగలకుండా గ్రహించాలి (తుంచాలి). అలా గ్రహించేటప్పుడు ‘తులసి! అమృత జన్మాసి! సదాత్వం కేశవప్రియే‘ అని చెప్పి గ్రహించాలి.
4. పుష్పాన్నైనా, తులసినైనా తీసుకుని హృదయానికి నేరుగా ఉంచి, ఈ నా హృదయం అమృతమయమైనది, ఈ హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నన్ను నేనే నీకు సమర్పిస్తున్నాను అని ఆయన తిరువడి (పాదాల) వద్ద అర్పణం చేయాలి.
5. అలా అర్పణం చేసేటప్పుడు కింద వచ్చే శ్లోకం యొక్క అర్థాన్ని స్మరించుకుని పుష్పాన్ని సమర్పించాలి.
అహింసా ప్రథమం పుష్పం
పుష్పం ఇంద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం
క్షమా పుష్పం విశేషతః
శాంతిః పుష్పం తపః పుష్పం
జ్ఞానం పుష్పం తథైవచ
సత్యం అష్టవిధం పుష్పం
విష్ణోః ప్రీతి కరంభవేత్
6. సత్యం భగవానునికి మిక్కిలి ఇష్టమైన పుష్పం. మనుస్మృతి “సత్యమే మాట్లాడు. సత్యాన్ని కూడా ప్రియంగా మాట్లాడు. నిజాన్ని ఇతరులను నొప్పించేలా చెప్పకు, అదే సమయంలో ప్రియమైన వారని అబద్ధం చెప్పకు. ఇదే నీ ధర్మంగా ఉండాలి” అని చెబుతోంది.
7. ‘విష్ణవే నమః‘ అని చెప్పి అర్చించేటప్పుడు పైన చెప్పిన ఎనిమిది మనలో ఉన్నాయా అని చూసుకోవాలి. అలా గ్రహించి అర్చన చేస్తే ఈ ఎనిమిది రకాల పుష్పాలు – అంటే గుణాలు మనకు వచ్చేస్తాయి.
8. మనం ఒక పుష్పాన్ని ఇస్తున్నాం. ఒక నామాన్ని చెబుతున్నాం. ఆయన ఎనిమిది రెట్లుగా తిరిగి ఇస్తున్నాడు. అంత కారుణ్యం ఆయనది. ఈ విధంగా ఫలం ఏమిటని తెలుసుకుని అర్చన చేస్తున్నాం. ఫలం దొరకలేదు అంటే నిష్ఠ సరిపోలేదు అని అర్థం. మళ్లీ మళ్లీ ఫలం సిద్ధించేవరకు నిష్ఠతో ప్రయత్నం చేయాలి.
9. వ్యాస మహర్షి కఠినమైనది (భయంకరమైనది) అని చెప్పే కలియుగాన్ని ‘సాధు’ అంటున్నారు. ఎందుకంటే, శుద్ధమైన మంత్రోచ్ఛారణను మనసు లగ్నం చేసి విన్నట్లైతే, ఒక అశ్వమేధ యాగం చేస్తే పొందే ఫలాన్ని ఈ కలియుగంలో పొందవచ్చు. ఇంత సులభమైన విధానానికి ఒక షరతు ఉంది. అదే ‘మనసు లగ్నం చేసి‘ అనేది!
10. మనసు లగ్నం కావాలి అంటే ప్రాణాయామ బలం ఉండాలి. ప్రాణాయామం అంటే శ్వాసను పీల్చి వదిలే అభ్యాసం అని సులభంగా చెప్పవచ్చు. కానీ, పీల్చిన శ్వాసను లోపల ఆపే కాలం (సమయం) చాలా ముఖ్యం. ఆ సమయం ఎక్కువ అవుతూనే రావాలి. అప్పుడు మనసు అదుపులోకి వస్తుంది.
11. మల్లెతీగలా ఊగే మనసును ప్రాణాయామంలో నిలిపి, ఎంపెరుమానుడు అనే కొమ్మపై అంటే ఆయన పాదాలపై చుట్టి వదిలితే, అది పట్టుకుని పాకుతుంది.
12. స్త్రీలు కూడా ప్రాణాయామం చేయవచ్చు. మంత్రం చెప్పి చేయకుండా, శ్లోకం ద్వారా అభ్యాసం చేయవచ్చు. రామ మాత కౌసల్యా దేవి ప్రాణాయామం చేసింది. ఆమె పొందిన ఫలం ఉన్నతమైనది.
13. అలా ప్రాణాయామ బలంతో మనసు లగ్నం చేసి ఆయనను పొందడానికి ప్రయత్నిస్తే (ఎట్టినాళ్) అన్నీ లభిస్తాయి. ప్రయత్నిస్తే అందనిది అంటూ ఏమీ ఉండదు.
14. ఎనిమిది (ఎట్టు) అనేది భగవానుని నామమైన “ఓం నమో నారాయణాయ” (అష్టాక్షరి) ని సూచిస్తుంది. అది ఏమి ఇస్తుంది అని అడిగితే,
కులం తరుం శెల్వం తన్దిడుం
అడియార్ పడుతుయరాయినవెల్లామ్
నిలం తరం శెయ్యుం నీళ్విశుమ్బరుళుం
అరుళొడు పెరునిలమళిక్కుమ్
వళం తరుం మట్రుం తన్దిడుం
పెట్రతాయినమ్ ఆయిన శెయ్యుమ్
నలం తరుం శొల్లై నాన్ కణ్డుకొణ్డేన్
నారాయణా ఎన్నుం నామమ్ ||
(పెరియ తిరుమొళి 1.1.9)
15. నారాయణా అనే నామం మోక్షాన్నే తెచ్చిపెడుతుంది.
16. ఈ శరీరం పై మనం మోహం పెంచుకోకూడదు. ఆదిశంకరులు చెప్పిన మాటను మనం అలాగే మనసులో రాసుకోవాలి.
అంటే ” మోక్షానికి ఎవరు అధికారి?”
“ఎవరైతే ప్రాణాలతో ఉన్నప్పుడే తన శరీరాన్ని శవంగా భావిస్తారో, వారే మోక్షానికి అధికారి!” అని చెప్పారు.
17. మన లోపలనే పరమాత్మ వెలసి ఉన్నాడు. అంతటా ప్రవేశించగలవాడు మన లోపలను ఉన్నాడు, అచేతనాలలోపల (ప్రాణం లేని వాటిలో) కూడా ఉన్నాడు అనే ఉన్నత శాస్త్ర సత్యాన్ని గ్రహించాలి.
18. మన లోపల ఉన్నవాడిని ఆచార్యుల ద్వారా ఇవ్వబడిన మంత్రం మూలంగా చూడవచ్చు.
19. ఒక మంత్రాన్ని మనమే పుస్తకంలో చదివి కంఠస్థం పట్టకూడదు. అలా కంఠస్థం చేసి జపం చేస్తే ఏ రోజూ ఫలాన్ని ఇవ్వదు. ఆచార్యుని దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆయన ఉపదేశం చేసిన తర్వాతనే ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానంలో పెట్టుకోవాలి.
20. మంత్రం పైన, మంత్రం లోని దేవత పైన, ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుని పైన మనకు సమానమైన భక్తి ఉండాలి. అప్పుడే అది సిద్ధిని ఇస్తుంది. అంటే పూర్ణ ఫలాన్ని ఇస్తుంది.
21. గాయత్రీ మంత్రాన్ని ఎవరు బాగా గానం చేస్తారో, వారిని ఆ మంత్రం రక్షిస్తుంది. అష్టాక్షరి కూడా అలాగే రక్షిస్తుంది. పురుషులు గాయత్రిని చెప్పిన తర్వాత అష్టాక్షరి చెప్పాలి.
22. ప్రణవాన్ని గృహస్థులు ఒంటరిగా ఉచ్చరించకూడదు. మంత్రంతో కలిపి ఉచ్చరించేటప్పుడు మూడు మాత్రలలో ఉచ్చరించాలి. స్త్రీలు ప్రణవాన్ని ‘అం’ అని ఉచ్చరించాలి.
23. శాస్త్రాన్ని మీరి, తనకు తోచినట్టు ఒకడు కార్యం (పని) చేస్తే అతడికి సిద్ధి కలగదు. ఇది భగవానుని వాక్కు.
24. భగవానునికి కోపం తెప్పించకుండా మనం శాస్త్ర మార్గంలో జీవించాలి.
25. వెయ్యి మంది తల్లీదండ్రుల ప్రేమ కన్నా మిన్నయైనది శాస్త్రం మన పై చూపే ప్రేమ.
26. శాస్త్రం తప్పకుండా జీవించే వాడిని వెతుక్కుంటూ అన్నీ శుభాలు, ఫలాలు పరిగెత్తుకు వస్తాయి. అతడు వెళ్లే చోటల్లా విశేషమైన కీర్తి కలుగుతుంది.
27. మన సంప్రదాయంలో జ్ఞానం కన్నా ఆచారానికి, అనుష్ఠానానికి విశేష గౌరవం ఇవ్వబడుతుంది.
28. ఒకరు ఆచారంగా ఉండి అనుష్ఠిస్తేనే ఇతరులు అనుష్ఠిస్తారు. లేదా ‘ఆయనే అనుష్ఠించలేదు, నేను ఎందుకు అనుష్ఠించాలి..?’ అని అడుగుతారు.
29. అనుష్ఠానంలో సూర్యుడిని చూడటం చాలా ముఖ్యం. సూర్యుడిని ఎవరు ముందుగా చూస్తారో వారు ఉన్నతులు. అందువల్ల, మనం సూర్యోదయానికి ముందే లేచి ఆయన రావడాన్ని ఎదురుచూస్తూ నమస్కరించాలి.
30. భగవానుడు రామావతారంలో సూర్య కులంలో అవతరించాడు. కృష్ణావతారంలో సూర్యుడిని ముందుగా చూసే కులంలో పెరిగాడు.
31. అలాంటి సూర్యుడినే తన కుడి కన్నుగా (నేత్రంగా) కలిగినవాడు లక్ష్మీనృసింహుడు!
32. ఓంకారంలో మొదటిదిగా వచ్చే అకార రూపంగా వెలుగుతున్నవాడు, సూర్యుడిని నేత్రంగా కలిగినవాడు, ఉమ్ అనే అక్షరంలో నివసించేవాడు, శరణుజొచ్చిన వారికి అభయ వరదుడిగా ఉన్నవాడు మన మట్టపల్లి శ్రీ యోగానంద లక్ష్మీనృసింహుడు. ఆయనే “సకలం భద్రమశ్నుతే” అని సర్వ మంగళాలను ప్రసాదించేవాడు. ఆయనను ఈ ఉన్నతమైన సుదినమందు కీర్తించి పూజించి సకల సంపదలను పొందుదాం..!
|| సకలం భద్రమశ్నుతే! ||